'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా బౌండరీలు దాటేసింది. చాలా సినిమాలు హాలీవుడ్ రేంజ్లో రూపుదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా యాక్షన్, సినిమాటోగ్రఫీ తదితర కీలక అంశాల పట్ల హాలీవుడ్ స్టైల్ మేకింగ్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు దర్శక, నిర్మాతలు. యూనివర్సల్ స్టార్డమ్ ఉన్న హీరోల సినిమాల విషయంలో ఆ జాగ్రత్త ఇంకాస్త ఎక్కువగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం రానా హీరోగా తెరకెక్కుతోన్న 'విరాటపర్వం' చిత్రం కూడా ఆ రేంజ్‌లోనే రూపుదిద్దుకుంటోంది. ఆడియన్స్ అంచనాల్ని ఏమాత్రం తగ్గించకుండా, ఈ సినిమాకి భారీగా ఖర్చు పెడుతున్నారట.
యాక్షన్ ఘట్టాల్ని హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిస్తున్నారట. ప్రస్తుతం కేరళలో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇక్కడే ఓ భారీ యాక్షన్ సన్నివేశానికి స్కెచ్ ప్రిపేర్ చేస్తున్నారట. ఈ యాక్షన్ సీక్వెన్స్‌ని హాలీవుడ్ స్టంట్ మాస్టర్ స్టీఫెన్ రిచర్డ్ కంపోజ్ చేస్తున్నారట. ఈ యాక్షన్ ఘట్టం సినిమాకి హైలైట్ అవుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. 'నీదీ నాదీ ఒకే కథ' ఫేమ్ వేణు ఉడుగుల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో డి. సురేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. యాక్షన్ ఘట్టాలతో పాటు, హీరోయిన్‌తో సాగే రొమాంటిక్ సన్నివేశాలు ఈ సినిమాలో కీలకమట. సీనియర్ నటి ప్రియమణి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సమ్మర్లో సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ALSO READ: బన్నీ ఫార్ములాలోనే ఎన్టీఆర్ సినిమా.