ENGLISH

బాలకృష్ణుడు రివ్యూ రేటింగ్స్

24 November 2017-12:34 PM

తారాగణం: నారా రోహిత్, రెజీన, రమ్యకృష్ణ, అజయ్, పృథ్వీ తదితరులు...
నిర్మాణ సంస్థ: శరస్చంద్రిక విజినరి మోషన్ పిక్చర్స్
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: విజయ్ సీ కుమార్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
నిర్మాతలు: మహేంద్ర బాబు, వంశీ, వినోద్
దర్శకత్వం: పవన్ మల్లెల

యావరేజ్ యూజర్ రేటింగ్: 2.5/5

ట్యాగ్ లైన్: పృథ్వీ షో..


రొటీన్ కమర్షియల్ కథలకి కొద్దిగా పక్కకి జరిగి సినిమాలు చేస్తుంటాడు నారా రోహిత్. అలంటి నారా రోహిత్ మొదటిసారిగా ఒక పక్కా కమర్షియల్ చిత్రం చేయడానికి సిద్ధపడ్డాడు. మరి ఆ కమర్షియల్ సినిమాలో నారా రోహిత్ ఎలా చేశాడు? ఆ సినిమా ఎలా ఉంది అన్నది ఈ క్రింద బాలకృష్ణుడు సమీక్షలో చూద్దాం..

కథ..

భానుమతి (రమ్యకృష్ణ) తన మేనకోడలు అయిన ఆధ్య (రెజీన)ని హైదరాబాద్ లో ఎవ్వరికీ తెలియకుండా దాచి తమ శత్రువుల భారీ నుండి కాపాడుతుంటుంది. ఇదే సమయంలో ఆధ్యకి తెలియకుండా తనకి బాడీ గార్డ్ గా బాలు (నారా రోహిత్) వస్తాడు. తాను జైలులో ఉండడానికి, ఇన్ని కష్టాలు పడడానికి కారణమైన భానుమతి పైన పగని తీర్చుకోవాలంటే ఆధ్యని చంపడమే మార్గం అని ఆలోచించి ఆధ్యని చంపడానికి జైలు నుండే ప్లాన్ చేస్తుంటాడు ప్రతాప్ రెడ్డి).

ఈ సమయంలోనే ఒకరోజు అనుకోకుండా బాలు, ఆధ్యలకి ప్రతాప్ రెడ్డి తారసపడడం వారు ఒకరికిఒకరు తెలియకుండా కారులో ప్రయాణిస్తుంటారు. అలా ప్రయాణిస్తున్న వారికి ఒకరి గురించి ఒకరి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ఏమి చేశారు? చివరికి ప్రతాప్ నుండి ఆధ్యని బాలు ఎలా రక్షించగలిగాడు అన్నది తెర పైన చూడొచ్చు.

నటీనటుల ప్రతిభ:

నారా రోహిత్: మొదటిసారిగా ఒక కమర్షియల్ చిత్రం చేస్తున్నప్పటికీ, తనలోని సహజత్వాన్ని ఎక్కడా కోల్పోలేదు. పైగా ఒక మాస్ సినిమాకి తగ్గట్టు డ్యాన్సులు, పంచులు, కామెడీ, ఫైట్లు బాగానే ప్రదర్శించాడు. మంచి కమర్షియల్ హీరోగా కూడా తాను మారగలను అని నిరూపించుకున్నాడు.

రెజీన: ఈ సినిమాలో ఫుల్ కమర్షియల్ హీరోయిన్ గా చేసింది. గ్లామర్ గా కనిపిస్తూ, డ్యాన్సులు చేస్తూ నారా రోహిత్ కి సరిజోడిగా బాగానే చేసింది.

రమ్యకృష్ణ: భానుమతిగా పాత్రలో కనిపిస్తుంది. మనకి కనిపించేది కొన్ని సన్నివేశాల్లోనే అయినా బాగానే ఆకట్టుకుంది. శివగామి తరహా అభినయం చూపించే ప్రయత్నం చేసింది.

పృథ్వీ: ఈ సినిమాలో దాదాపుగా మనకి కనిపించే మ్యాడీ. ఆర్ పాత్రలో కడుప్పుబ్బా నవ్విస్తాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో అయితే కామెడీ పార్ట్ ని పృథ్వీ తన భుజాల పైన మోస్తాడు అని చెప్పొచ్చు.

అజయ్: పగతో రగిలిపోయే పాత్రలో విలనిజాన్ని పండించాడు.

ఇతర తారాగణం- కోట శ్రీనివాస రావు, వెన్నెల కిశోర్, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి, శివప్రసాద్ తమ పాత్రల వరకు బాగానే న్యాయం చేశారు.

 

విశ్లేషణ: 

హీరోయిన్ ఆపదల్లో ఉంటే హీరో కాపాడడం, విలన్ నుండి రక్షించడం అనేది ఒక రెగ్యులర్, రొటీన్ కమర్షియల్ ఫార్ములానే ఈ బాలకృష్ణుడు చిత్రంలో కనిపిస్తుంది. అయితే ఇటువంటి కథలు జనాలకి ఎక్కాలంటే ఎంటర్టైన్మెంట్ పార్ట్ బాగా పండాలి, ఈ అంశాన్ని దర్శకుడు బాగానే హ్యాండిల్ చేశాడు అని చెప్పొచ్చు.

ఈ సినిమా వరకు కథ, పాత్రలు, కథనం గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కాని కథని నడిపే సమయంలో ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ అదే నవ్వించడంలో మాత్రం విజయవంతం అయ్యాడు. ముఖ్యంగా పృథ్వీ పాత్ర మొత్తం మనల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో కామెడీ డైలాగ్స్ ఎంతగా నవ్వించాయో అలాగే ఒక ఎమోషనల్ డైలాగ్ కూడా మనల్ని కట్టిపడేస్తుంది.

అదే- “బిడ్డా..  పగ చల్లారిపోతుంది, ప్రేమ చచ్చిపోతుంది.. కాని పేరు మాత్రం ఒకసారి పోతే మళ్ళీ రాదు...”

దర్శకుడు పవన్ మల్లెల్ల రైటింగ్ పార్ట్ పైన బాగానే వర్క్ చేసినట్టు మనకు అర్ధమవుతుంది. సినిమాలో ఎక్కడా కూడా పెద్దగా బోర్ కొట్టించడు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక డ్రామా సీక్వెన్స్ మిమ్మల్ని పక్కగా అలరిస్తుంది.

మొత్తంగా ఈ వారంలో ధియేటర్ కి వెళ్ళి ఒక కమర్షియల్ చిత్రం చూడాలనుకునేవారికి ఈ చిత్రం బెస్ట్ ఆప్షన్.

సాంకేతిక వర్గం పనితీరు:

విజయ్ సి కుమార్ కెమెరా పనితనం బాగుంది, మెలోడీ బ్రహ్మ మణిశర్మ పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకే అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:   

+ పృథ్వీ కామెడీ
+ ఎంటర్టైన్మెంట్ పార్ట్

మైనస్ పాయింట్స్:

- రొటీన్ కథ

ఆఖరి మాట: బాలకృష్ణుడు- కమర్షియల్ సినిమా అభిమానులకి అలాగే పృథ్వీ కామెడీ ఫ్యాన్స్ కి ఇది మంచి ఆప్షన్.

రివ్యూ బై సందీప్