ENGLISH

గేమ్ ఓవర్ మూవీ రివ్యూ రేటింగ్

14 June 2019-14:30 PM

నటీనటులు: తాప్సి పన్ను,అనీష్ కురువిళ్ళ తదితరులు.
దర్శకత్వం: అశ్విన్ శరవణన్
నిర్మాతలు: శశి కాంత్, చక్రవర్తి రామచంద్ర
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫర్: శివకుమార్ విజయన్  
విడుదల తేదీ: జూన్ 14, 2019

 

రేటింగ్‌: 2.75/5 

 

తాప్సిని తెలుగు ప్రేక్ష‌కులు కేవ‌లం గ్లామ‌ర్ తార‌గానే చూశారు. బాలీవుడ్‌కి వెళ్లాక తాప్సిలో చాలా మార్పు వ‌చ్చింది. మంచి క‌థ‌లు ప‌డ్డాయి. ఆ క‌థ‌ల‌కు త‌గినట్టే మంచి పాత్ర‌లు వ‌చ్చాయి. ఆ పాత్ర‌ల్లో త‌న‌ని తాను నిరూపించుకుంటూ, త‌న‌లోని కొత్త న‌టిని బ‌య‌ట‌కు తీసుకొచ్చింది. `పింక్‌`లాంటి చిత్రాలు తాప్సి ప్ర‌తిభ‌కు అద్దం ప‌ట్టాయి. మంచి క‌థ ప‌డితే - తాప్సి నుంచి త‌ప్ప‌కుండా మ‌రిన్ని మంచి సినిమాలు చూడొచ్చ‌న్న న‌మ్మ‌కం క‌లిగింది. సినిమా అంత‌టినీ త‌న భుజాల‌పై వేసుకుని మోయ‌గ‌ల‌ద‌ని నిరూపించుకుంది. ఆ న‌మ్మ‌కంతోనే `గేమ్ ఓవ‌ర్‌` అనే మ‌రో సినిమా చేసింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది?  తాప్సి ఆడిన గేమ్ ఏమిటి?

 

* క‌థ‌

 

స్వ‌ప్న (తాప్సీ) ఒక వీడియో గేమ్ డిజైన‌ర్‌. త‌న జీవితంలో అనుకోని ఘ‌ట‌న వ‌ల్ల‌...మానసికంగా చాలా ఇబ్బంది ప‌డుతుంటుంది. చీక‌టి అంటే చాలా భ‌యం. దానికి తోడు... కొత్త కొత్త ఇబ్బందులు మొద‌ల‌వుతాయి. చేతికి చాలాప్రేమ‌తో వేసుకున్న ప‌చ్చ‌బొట్టు.. మండుతూ ఉంటుంది. ఆత్మ హ‌త్య చేసుకోవాల‌న్న కోరిక బ‌లంగా క‌లుగుతుంటుంది. 
స్వ‌ప్న చేతిమీద ఉన్న‌  ప‌చ్చ‌బొట్టుకీ,  అమృత అనే అమ్మాయికీ ఓ చిన్న పాటి సంబంధం ఉంటుంది. ఇంత‌కీ అమృత ఎవ‌రు? ప‌చ్చ‌బొట్టుతో ఉన్న సంబంధం ఏమిటి? స‌్వ‌ప్న‌కు ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌కూ, వాటికీ ఉన్న సంబంధం ఏమిటి?  అందులోంచి తాను ఎలా బ‌య‌ట‌ప‌డింది? అనేదే క‌థ‌. 


 

* న‌టీన‌టులు

 

తాప్పి అత్యుత్త‌మ న‌ట‌న ప్రద‌ర్శించిన చిత్రాల జాబితాలో త‌ప్ప‌కుండా ఈ సినిమా ఉంటుంది. భ‌యం, ఆందోళ‌న‌, చేత‌కానిత‌నం.. ఇవ‌న్నీ క‌ల‌గ‌లిపిన ఓ స‌గ‌టు అమ్మాయి పాత్ర పోషించింది. ఎక్క‌డా న‌టిస్తున్న‌ట్టు అనిపించ‌దు. మ‌న‌క‌ళ్ల ముందు ఓ జీవితాన్ని చూస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది. అతి త‌క్కువ పాత్ర‌ల చుట్టూ న‌డిచే క‌థ ఇది. ఓ ఇంట్లో ఇద్ద‌రి మ‌ధ్య ఇంత డ్రామా సృష్టించొచ్చ‌ని నిరూపించిన క‌థ ఇది. క‌ళ‌మ్మ‌గా న‌టించిన ప‌నిమనిషి కూడా చాలా చ‌క్క‌గా త‌న పాత్ర‌లో ఒదిగిపోయింది. అమృత త‌ల్లి క‌నిపించేది ఒక్క సీన్‌లోనే. అందులో త‌న న‌ట‌న గుర్తు పెట్టుకునే విధంగా ఉంది.

 

* సాంకేతిక వ‌ర్గం

 

ఓ ఇంట్లో సినిమా తీస్తూ రెండు గంట‌లు కూర్చోబెట్ట‌డం మామూలు విష‌యం కాదు. కెమెరా, ఆర్‌.ఆర్‌, ఆర్ట్ ఈ విభాగాలు క‌ల‌సిక‌ట్టుగా ప‌నిచేయాలి. `గేమ్ ఓవ‌ర్‌`లో ఆ పనిత‌నం క‌నిపించింది. స్క్రీన్ ప్లే ప‌రంగా కొన్ని అంశాలు ఆక‌ట్టుకుంటాయి. ద‌ర్శ‌కుడు డిటైలింగ్ బాగుంది. కాక‌పోతే.. దాని వ‌ల్లే సినిమా లాగ్ అయిన‌ట్టు అనిపిస్తుంటుంది. ఓ థ్రిల్ల‌ర్‌ని ఇంటిలిజెంట్‌గా మ‌ల‌చ‌డం చాలా క‌ష్ట‌మైన విష‌యం. ద‌ర్శ‌కుడు ఈ విష‌యంలో ఆకట్టుకునే ప్ర‌తిభ క‌న‌బ‌రిచాడు.

 

* విశ్లేష‌ణ‌

 

ఇదో థ్రిల్ల‌ర్‌. ఓ ఇంట్లో ప‌ని మ‌నిషితో ఉంటున్న క‌థానాయిక‌ - సైకో కిల్ల‌ర్ బారీ నుంచీ ఎలా బ‌య‌ట‌ప‌డింద‌న్న‌ది క‌థ‌. ఇలాంటి క‌థ‌లు చాలా వ‌చ్చాయి. కాక‌పోతే ఈ క‌థ‌కు యానివ‌ర్సిరీ సిండ్రోమ్‌, మెమొరియ‌ల్ టాటూ అనే రెండు పాయింట్లు జోడించాడు. ఈ క‌థ‌కు ఏమైనా కొత్త‌ద‌నం తోడైందంటే.. ఈ రెండు పాయింట్ల వ‌ల్లే - సినిమాలో స‌గ భాగం ఈ రెండింటిపైనా ఫోక‌స్ చేసి న‌డిపించాడు ద‌ర్శ‌కుడు. యేడాది క్రితం స్వ‌ప్న వేసుకున్న టాటూ ఇప్పుడెందుకు ఇబ్బంది పెడుతోంది?  టాటూలో ఆత్మ ఉండ‌డం ఏమిటి?  అనే విష‌యాలు ఆస‌క్తి రేపుతుంటాయి. ద్వితీయార్థంలో సైకో బారీ నుంచి క‌థానాయిక త‌న‌ని తాను ఎలా కాపాడుకుంది? అనేది పాయింట్‌.

 

థ్రిల్ల‌ర్‌కి కావ‌ల్సిన ల‌క్ష‌ణాల‌కంటే, ఒక‌టో రెండో ఎక్కువే గేమ్ ఓవ‌ర్‌కి ఉన్నాయి. ఈ పాయింట్ల‌ని క‌థ‌కు ముడి పెడుతూ ద‌ర్శ‌కుడు కూడా చాలా చ‌క్క‌గానే తెర‌పైకి తీసుకొచ్చాడు. ఒక‌రి కాపాడ‌డానికి మ‌రొక‌రు రార‌ని - ఎవ‌రికి వాళ్లు ర‌క్షించుకోవాల‌ని - ప్రాణం పోతున్న‌ప్పుడు కూడా పోరాడే స్ఫూర్తి వ‌దులుకోకూడ‌ద‌ని చెప్ప‌డానికి ద‌ర్శ‌కుడు చేసిన ప్ర‌య‌త్న‌మిది. తాను తీసుకున్న అంశం, తీర్చిదిద్దిన విధానం రెండూ అతికిన‌ట్టు స‌రిపోయాయి.

 

కాక‌పోతే... ద‌ర్శ‌కుడు ప్ర‌తీ స‌న్నివేశాన్నీ తెలివిగా తెర‌కెక్కించాల‌ని చూశాడు. అందుకోసం చాలా స‌మ‌యం తీసుకున్నాడు. ప్ర‌తీ విష‌యాన్నీ డిటైల్డ్‌గా చెప్పే ప్ర‌య‌త్నంలో కాల‌యాప‌న చేశాడు. చివ‌రి ప‌ది నిమిషాల్లోనూ అస‌లు పాయింట్ తెర‌పైకి వ‌స్తుంది. ఆ పాయింట్ కోసం టాటూనీ, యానివ‌ర్సిరీ సిండ్రోమ్‌నీ టూల్స్‌గా వాడుకున్నాడు. ఈ రెండు పాయింట్లూ అర్థం కాని ప్రేక్ష‌కుడికి ఇదంతా గంద‌ర‌గోళంతా క‌నిపిస్తుంటుంది. సైకోలు ఎవ‌రు?  వాళ్లెందుకు ఇలా చేస్తున్నారు?  అస‌లు యేడాది క్రితం స్వ‌ప్న జీవితంలో ఏం జ‌రిగింది?  అనే విష‌యాల్ని ఏమాత్రం చెప్ప‌లేదు. ఈ క‌థ‌కు  అవ‌స‌రం లేద‌నుకున్నాడా?  లేదంటే అవి చెప్ప‌క‌పోయినా ఫ‌ర్లేద‌ని ద‌ర్శ‌కుడు భావించాడా?  తొలి స‌గంలో ప్ర‌తీ విష‌యాన్నీ డీటైల్డ్‌గా చెప్పిన ద‌ర్శ‌కుడు అస‌లైన ఈ పాయింట్‌ని ఎందుకు వ‌దిలేశాడు? అనే అనుమానాలు, ప్ర‌శ్న‌లూ ఉద్భ‌విస్తాయి.

 

* ప్ల‌స్ పాయింట్స్‌ 

+తాప్సి

+స్క్రీన్ ప్లే

+టెక్నిక‌ల్ టీమ్‌

 

* మైన‌స్ పాయింట్స్
- సాగ‌దీత‌

 

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: గేమ్ బాగుంది.


- రివ్యూ రాసింది శ్రీ.

ALSO READ: గేమ్ ఓవర్ మూవీ ఇంగ్లీష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి