భారత్ దేశంలో క్రికెట్ ఓ మతం. ఈ దేశంలో వికెట్టు పాతని ఊరు వుండదు. జీవన విధానంలో అంతలా బాగమైపోయింది క్రికెట్టు. మనకి లెజండరీ ఆటగాళ్ళు వున్నారు. ప్రపంచ క్రికెట్ లో ఇండియాకి ఘన చరిత్ర వుంది. ముఖ్యంగా 1983.. దేశ క్రికెట్ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం. దేశం ప్రపంచ కప్ ని ముద్దాడిన క్షణం. ఇప్పుడా గోల్డెన్ ఇయర్ ని వెండితెరపై చూపించబోతున్నారు. లెజెండరీ క్రికెటర్ కపిల్‌దేవ్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన చిత్రం 83. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ట్రైలర్ బయటికి వచ్చింది. మూడు నిమిషాల నిడివి గల ట్రైలర్ దాదాపు వరల్డ్ కప్ లో ముఖ్యమైన ఘట్టాలన్నీ చూపించారు.
1983 వరల్డ్ కప్ కి ముందు ఇండియా క్రికెట్ టీంపై ఎవరికీ నమ్మకాలు లేవు. ఫ్లైట్ టికెట్లకి కూడా డబ్బులు దండగా అనుకున్నారు. ఎయిర్ పోర్ట్ టీంకి బస్ కూడా పంపించలేదు. ప్రెస్ మీట్ లో మేము గెలవడానికి వచ్చామని కపిల్ దేవ్ చెబితే ప్రపంచ క్రికెట్ అపహాస్యం చేసింది. జింబాబ్వే తో గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో తొమ్మది పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన పీకల్లోతు కష్టాల్లో పడటం, బాత్ రూమ్ స్నానం చేస్తున్న కపిల్ దేవ్ తడి బట్టలతోనే బ్యాటింగ్ కి దిగి 175 పరుగులు బాదడం, వెస్ట్ ఇండీస్ ఫేసర్లలని ఎదుర్కోలేక గాయాలు పాలవ్వడం, చివరిగా యావత్ దేశం ఆశల పల్లకిని మోసి క్రికెట్ వరల్డ్ కప్ ని ముద్దాడటం.. ఇవన్నీ ట్రైలర్ కనిపించాయి. చివర్లో టీం సభ్యుల పేర్లు అన్నీ చూపించడం బావుంది. 1983 వరల్డ్ కప్ సమయంలో ఇప్పుడు ఉన్నంత మీడియా, సోషల్ మీడియా, ఛానల్స్ ప్రసారం లేదు. నాటి సంగతులు తెరపై చూడాలనే ఉత్సాహం అందరిలోనూ వుంది. ఇప్పుడు ట్రైలర్ చూస్తే... దర్శకుడు కబీర్ ఖాన్ సినిమాటిక్ ఎక్స్ పిరియన్స్ తో తెరకెక్కించాడనిపిస్తుంది. డిసెంబర్ 24న ప్రేక్షకుల ఈ చిత్రం ముందుకు రానుంది. అన్నట్టు ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున విడుదల చేస్తున్నారు.
ALSO READ: సర్కారువారి పాట VS లైగర్