ENGLISH

ఇలాగైతే చాలా చాలా కష్టం మేడమ్‌.!

14 January 2020-10:30 AM

'పవర్‌ఫుల్‌ రోల్స్‌ మాత్రమే చేస్తాను..' అంటున్నారు లేడీ సూపర్‌ స్టార్‌, సీనియర్‌ నటి విజయశాంతి. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ఆమెకు గ్రాండ్‌ రీ-ఎంట్రీ లభించిన మాట వాస్తవం. అయితే, సినిమాలో ఆమె పాత్ర మరీ అంత గొప్పగా లేదంటూ సినీ విమర్శకులు తేల్చి చెప్పేశారు. మరోపక్క, విజయశాంతి ఇకపైనా పవర్‌ఫుల్‌ రోల్స్‌ మాత్రమే చేస్తానని చెబుతున్నారు. కానీ, ఆమె కోసమే ప్రత్యేకంగా పవర్‌ఫుల్‌ పాత్రల్ని రాసుకునే పరిస్థితి ప్రస్తుతం తెలుగులో వుందా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. టాలీవుడ్‌లో కథలు, స్టార్‌ హీరో చుట్టూనే తిరుగుతుంటాయి. చాలా అరుదుగా మాత్రమే కథకు అనుగుణంగా నటీనటుల ఎంపిక జరుగుతుంటుంది. ఒక్క సినిమా బ్యాక్‌ఫైర్‌ అయితే ఆ తర్వాత అంతే సంగతులు.

 

విజయశాంతి హీరోయిన్‌గా ఎన్నో భిన్నమైన సినిమాలు చేశారు. హుందాతనంతో నిండిన పాత్రలు చేస్తాననడం వరకూ ఓకే. కానీ, కేవలం పవర్‌ఫుల్‌ రోల్స్‌కే పరిమితమవుతానంటే.. అది అంత తేలికైన విషయం కాదు. ఒక్కటి మాత్రం నిజం.. విజయశాంతికి అంటూ ప్రత్యేకంగా ఫ్యాన్‌ బేస్‌ వుంది తెలుగు రాష్ట్రాల్లో. అయితే అది ఒకప్పుడు వున్నంత స్ట్రాంగ్‌గా ఇప్పుడు లేదన్నది కూడా నిర్వివాదాంశం. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా వరకూ విజయశాంతి స్టార్‌డమ్‌ ఆ సినిమాకి హెల్ప్‌ అయ్యింది. మరి, తదుపరి సినిమాలకూ ఇదే హంగామా వుంటుందా.? ఇంతకు మించిన పవర్‌ఫుల్‌ పాత్రలు ఆమెకు వస్తాయా.? అంటే ఇప్పుడే చెప్పలేం.

ALSO READ: కమెడియన్ కృష్ణుడు ఇంట విషాదం.