ENGLISH

ఎస్పీ బాలుకి అరుదైన గౌరవం.. అయినా ఏదో లోటు!

27 January 2021-11:00 AM

కొన్ని పురస్కారాలు కొందరు వ్యక్తులకు గౌరవాన్ని పెంచుతాయి. కొన్ని సందర్భాల్లో ఆయా వ్యక్తులు ఆయా పురస్కారాల గౌరవాన్ని పెంచుతారు. తాము సాధించిన విజయాల ద్వారా, తమ గొప్పతనం ద్వారా ఆయా వ్యక్తులు తాము పొందిన పురస్కారాలకు అదనపు గౌరవాన్ని ఆపాదించినవారవుతారు. పద్మ విభూషణ్.. భారతదేశానికి సంబంధించి రెండో అత్యున్నత పౌర పురస్కారం. ఈ పురస్కరాన్ని కేంద్రం, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి ప్రకటించింది.

 

నిజమే, ఈ పురస్కరానికి ఎస్పీ బాలు అన్ని విధాలా అర్హుడు. అయితే, అంతకు మించి.. అన్న చర్చ బాలు అభిమానుల్లో జరుగుతోంది. ఔను, ఎస్పీ బాలు.. భారతరత్నం. ఆయనకు దక్కాల్సింది భారతరత్న పురస్కారం.. అన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన. నిజానికి, బాలు లాంటి వారు ఆయా అవార్డులకు వన్నె తెస్తారు. ఎస్పీ బాలు మరణించాక, ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలనే డిమాండ్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే, ఆ డిమాండ్లను కేంద్రం సరిగ్గా పరిశీలించలేదేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

 

గాన గంధర్వుడు అన్న అభిమానుల పిలుపుని మించిన పురస్కారం, గౌరవం ఎస్పీ బాలుకి ఇంకేముంటాయి.? అన్న కోణంలో చూస్తే, పద్మ విభూషణ్ పురస్కారం విషయంలో వివాదాలకు ఆస్కారమివ్వకపోవడమే మంచిది. ఎస్పీ బాలు అంటే, కేవలం తెలుగు నేలకు మాత్రమే పరిమితం కాదు.. ఆయన గానామృతం ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియుల్ని అలరించింది.. అలరిస్తూనే వుంది. ఆయన మరణించాక కూడా, మన చెవుల్లో ఆయన పాటలు మార్మోగుతూనే వున్నాయి.. వాటిల్లో ఆయన ఎప్పటికీ జీవించే వుంటారు.

ALSO READ: పవన్ రెండు పడవల ప్రయాణం.. ఎందాకా.?