ENGLISH

కరోనా ఖతం.. స్టార్స్‌ అంతా యాక్షన్‌లోకొచ్చేస్తున్నారు.

02 October 2020-13:00 PM

ఎన్నాళ్ళు కరోనా భయంతో ఇంట్లోనే కూర్చుంటాం.? అన్న భావన ఇప్పుడు సినీ పరిశ్రమలో స్పష్టంగా కన్పిస్తోంది. యంగ్‌ హీరోలు రిస్క్‌ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. వ్యాక్సిన్‌ వచ్చేవరకు సినిమా షూటింగులు కష్టమే అనే పరిస్థితి నుంచి, వ్యాక్సిన్‌ వచ్చినా రాకున్నా.. తగిన జాగ్రత్తలతో సినిమా షూటింగులు చేసుకోక తప్పని పరిస్థితి దాకా టాలీవుడ్‌ ముందడుగు వేసింది. యంగ్‌ హీరోలు ఇప్పటికే తమ తమ సినిమాల షూటింగులకు అటెండ్‌ అవుతోంటే, సీనియర్‌ హీరోలు కూడా అదే బాటలో పయనించేందుకు సమాయత్తమవుతున్నారు.

 

తాజాగా ప్రభాస్‌, ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్‌ నిమిత్తం.. విదేశాలకు పయనమయినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా విదేశాల్లో షూటింగుల విషయమై సినీ పరిశ్రమలో కొంత గందరగోళం వుంది. కానీ, ఆయా దేశాల్లోనూ కరోనా లాక్‌ డౌన్‌ నుంచి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న దరిమిలా.. అక్కడా షూటింగులకు లైన్‌ క్లియర్‌ అవుతోంది. అక్టోబర్‌ చివరి నాటికి తెలుగు సినిమాల షూటింగులు పూర్తిస్థాయిలో జోరందుకుంటాయనీ, మునుపటి జోరు సినీ పరిశ్రమలో కనిపిస్తుందనీ పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

 

అయితే, ఏడు నెలల సంక్షోభం నుంచి సినీ పరిశ్రమ బయటపడటానికి మాత్రం మరికొంత సమయం పట్టొచ్చు. 2021 సంక్రాంతికిగాని పరిస్థితులు పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి వచ్చే అవకాశం లేదు సినీ పరిశ్రమలో.

ALSO READ: థియేటర్లు ఓపెన్‌.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!