ENGLISH

ఆ హీరోని బెగ్గ‌ర్‌గా మారుస్తున్న పూరి

18 March 2025-19:51 PM

డ‌బుల్ ఇస్మార్ట్ త‌ర‌వాత పూరి జ‌గ‌న్నాథ్ సినిమా ఏమిట‌న్న విష‌యంలో నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ర‌క‌ర‌కాల రూమ‌ర్లు చ‌క్క‌ర్లు కొట్టాయి. గోపీచంద్ తో గోలీమ‌ర్ 2 చేస్తున్నాడ‌ని వార్త‌లొచ్చాయి. నాగార్జున‌కు ఓ క‌థ చెప్పాడ‌ని, ఆల్మోస్ట్ ఓకే అయిపోయింద‌ని కూడా చెప్పుకొన్నారు. అయితే ఇప్పుడు స‌రికొత్త న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. త‌మిళ స్టార్ విజ‌య్ సేతుప‌తితో పూరి సినిమా ఓకే అయ్యింద‌ని టాక్‌.


ఈ సినిమాకు సంబంధించిన ప‌నులు కూడా మొద‌లైపోయాయ‌ని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం 'బెగ్గ‌ర్‌' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. విజ‌య్ ఫ‌స్ట్ సిట్టింగ్ లోనే ఈ క‌థ‌ను ఓకే చేశాడ‌ని, త‌న సినిమాల‌న్నీ ప‌క్క‌న పెట్టి, బెగ్గ‌ర్‌ని ప‌ట్టాలెక్కించ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నాడ‌ని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.


ఏప్రిల్ మొద‌టి వారంలో విజ‌య్ సేతుప‌తితో ఓ ఫొటో షూట్ నిర్వ‌హిస్తున్నార‌ని, ఆ వెంట‌నే ఈ సినిమా షూటింగ్ కూడా మొద‌లైపోతుంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. లైగ‌ర్, డ‌బుల్ ఇస్మార్ట్‌ డిజాస్ట‌ర్ల త‌ర‌వాత పూరి బాగా వెనుక‌బ‌డిపోయాడు. త‌ను మ‌ళ్లీ ఫామ్ లోకి రావాలంటే ఓ సూప‌ర్ హిట్ కొట్టాలి. ఓర‌కంగా ఇది లాస్ట్ ఛాన్స్‌. పూరి కెప‌బులిటీపై ఎవ్వ‌రికీ సందేహాలు లేవు. త‌న‌దైన రోజున చిత్ర‌సీమ అవాక్క‌య్యే సినిమాని ఇవ్వ‌గ‌ల‌డు. కాంబినేష‌న్ ప‌రంగా ఈ సినిమాకు క్రేజ్ వుంది. దాన్ని పూరి స‌రిగ్గా హ్యాండిల్ చేసుకొంటే ఈ మాస్ డైరెక్ట‌ర్ మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేసిన‌ట్టే.