దిగ్గజ సినీ గీత రచయిత సిరివెన్నెల అకాల మరణం.. చిత్రసీమని కలిచి వేస్తోంది. ఆయన నిమోనియోతో పోరాడుతూ, తుది శ్వాస విడిచారు. కిమ్స్ లో 4 రోజుల పాటు చికిత్స సాగింది. అయితే ఆ బిల్లు భరిస్తామని అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ముందుకు రావడం... అందుకు తగిన చర్యలు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దిగ్గజ గీత రచయిత ఆసుపత్రి పాలై, చనిపోతే... ఆసుపత్రి బిల్లు కట్టడానికి రెండు ప్రభుత్వాలు ముందుకు రావడంలో ఎలాంటి వింతా లేదు. సదరు గీత రచయితపై ప్రభుత్వాలకు ఉన్న గౌరవం అనుకోవచ్చు.
కాకపోతే... ప్రభుత్వ సాయం అనేది ఒకొక్కరి విషయంలో ఒక్కోలా అందుతోందన్న విమర్శ ఉంది. ఇటీవల శివ శంకర్ మాస్టర్ చనిపోయారు. ఆయన చాలా దీన స్థితిలో ఉన్నారు. వైద్య ఖర్చులకు సైతం తమ దగ్గర డబ్బుల్లేవని శివ శంకర్ కుటుంబం బోరుమంది. ఆ సమయంలో... చిరంజీవి, సోనూసూద్, ధనుష్‌లాంటి వాళ్లు ముందుకు వచ్చి సహాయం చేశారు. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు. ఆఖరికి శివ శంకర్ మాస్టర్ చనిపోయినా, ప్రభుత్వాల నుంచి ఎలాంటి సంతాప సందేశం కూడా రాలేదు.కానీ సిరివెన్నెల విషయంలో రివర్స్ అయ్యింది. ఆయన ఆర్థికంగా బలంగానే ఉన్నారు. ఆయనకు హైదరాబాద్ లో ఆస్తులున్నాయి.
మాకు ఆర్థిక సమస్యలున్నాయి, సహాయం కావాలి.. అని వాళ్లెవరూ అడగలేదు. అడక్కుండానే పోటీ పడి సహాయం ప్రకటించడం విడ్డూరంగా అనిపిస్తుంది. ఇది వరకు కత్తి మహేష్ ఆసుపత్రి పాలైనప్పుడు కూడా ఏపీ ప్రభుత్వం సీ.ఎం రిలీఫ్ ఫండ్ నుంచి లక్షలు లక్షలు ఆసుపత్రి బిల్లుగా చెల్లించింది. అప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. కళాకారుల్ని ఒకే దృష్టితో చూడాలన్నది అందరి మాట. ఒక్క సిరివెన్నెలనే ప్రత్యేక దృష్టితో చూడాల్సిన అవసరం ఏంటన్నది ప్రశ్న. భవిష్యత్తులో ఏ కళాకారుడు ఆర్థిక బాధల్లో ఉన్నా, ఆసుపత్రి పాలైనా.. ప్రభుత్వాలు ఇలానే స్పందిస్తే మంచిదే. కొంతమందినే ప్రత్యేక దృష్టితో చూడడం సమస్యలకు, వివాదాలకూ తావిస్తుంది.
ALSO READ: 'అఖండ' మూవీ రివ్యూ& రేటింగ్