ENGLISH

అయినా టాలీవుడ్‌లో ఆ ‘ఊపు’ రావట్లేదెందుకు.?

10 October 2020-10:00 AM

అతి త్వరలో సినిమా హాళ్ళలో ప్రేక్షకులు వెండితెరపై సినిమాలు చూడబోతున్నారన్న సంతోషం తెలుగు సినీ పరిశ్రమలో కనిపించడంలేదు. కేంద్రం, అక్టోబర్‌ 15 తర్వాత సినిమా హాళ్ళు తెరుచుకోవడానికి అనుమతినిచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో విజయదశమి సీజన్‌ని క్యాష్‌ చేసుకోవాల్సి వుంది సినీ పరిశ్రమ. అయితే, సినిమా హాళ్ళకు ప్రేక్షకులు వస్తారా.? రారా.? అన్నదానిపై సందేహం నెలకొంది. దాంతో, దీపావళికి మాత్రమే సినిమా హాళ్ళు తెరుచుకునే అవకాశముందన్న కొత్త చర్చ తెరపైకొచ్చింది.

 

ఇదిలా వుంటే, కరోనా లాక్‌డౌన్‌ నుంచి ఒక్కో వెసులుబాటు వస్తుండడంతో సినీ పరిశ్రమలో జోరు కనిపిస్తోంది. సినిమా షూటింగులు పునఃప్రారంభమవుతున్నాయి. ఆయా సినిమాలకు సంబంధించి కొత్త కొత్త అప్‌డేట్స్‌ వస్తున్నాయి. కానీ, ఇవేవీ సినీ పరిశ్రమలో మునుపటి ‘ఊపు’కి తగ్గట్లుగా వుండడంలేదు. పూర్తిగా స్తబ్దత నెలకొందని అనలేంగానీ.. కొత్త స్తబ్దత మాత్రం కొనసాగుతోంది.

 

ప్రభాస్‌ కొత్త సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్నారనే ‘సూపర్‌ అప్‌డేట్‌’ వచ్చినా అటు సినీ ప్రేక్షకుల్లోనూ, ఇటు సినీ పరిశ్రమలోనూ ఉత్సాహం కనిపించని పరిస్థితి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషనల్‌ వీడియో అక్టోబర్‌ 22న వస్తుందనే అప్‌డేట్‌ వచ్చినా.. అదే పరిస్థితి. ఇలాగైతే పరిశ్రమ కోలుకునేదెలా.? అన్న ఆందోళన అంతటా నెలకొంది. సినిమా హాళ్ళు తెరచుకుని, కొన్ని సినిమాలు కమర్షియల్‌ విజయాలు సాధించి.. సినిమా ఫంక్షన్లు కూడా పూర్తిస్థాయిలో షురూ అయితే తప్ప.. పరిశ్రమ కోలుకోవడం కష్టమే.

ALSO READ: మ‌హేష్ సినిమాలో మ‌రో హీరో?