అసలే టాలీవుడ్ బిక్కుబిక్కుమని ఉంది. కరోనా తరవాత.. థియేటర్లకు రావడానికి జనం జంకు తున్నారు. మరోవైపు ఏపీలో టికెట్ రేట్ల రగడ ఉంది. అక్కడ టికెట్ రేట్లపై.. నిర్మాతలు పూర్తి అసంతృప్తితో ఉన్నారు. రేట్లు పెంచాల్సింది పోయి.. తగ్గించేయడం చిత్రసీమపై పెను భారం చూపిస్తుందన్నది నిర్మాతల భయం. మరోవైపు తెలంగాణలోనూ ఇలాంటి జీవో జారీ చేసే అవకాశం ఉందని, తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లు తగ్గిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే... తెలుగు చిత్రసీమ పూర్తిగా చిన్నాభిన్నం అవ్వడం ఖాయం.
అయితే.. అలాంటి భయాలేం పెట్టుకోవద్దని తెలంగాణ ప్రభుత్వం చెప్పేసింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్.. చిత్రసీమకు అభయ హస్తం అందించారు. టికెట్ రేట్లు తగ్గించే ఆలోచన ఏమాత్రం లేదని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాదు.. చిత్రసీమకు అవసరమయ్యే అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మూడో విడత లాక్ డౌన్‌లపై అనుమానాలు వద్దని, థియేటర్లు బంద్ కావని ధైర్యం నూరిపోశారు. ఓ రకంగా... చిత్రసీమకు ఇది తీపి వార్తే. తెలంగాణలో టికెట్ రేట్ల తర్జన భర్జనలకు తలసాని ఈ ప్రకటనతో పుల్ స్టాప్ పెట్టినట్టైంది. ఏపీలో కూడా పరిస్థితి ఓ కొలిక్కి వస్తే ఇంకా హ్యాపీ.
ALSO READ: ఓటీటీలో ఫట్టు.. టీవీల్లో హిట్టు