చిత్రం: కమిటీ కుర్రాళ్ళు
దర్శకత్వం: యదు వంశీ
కథ - రచన : యదు వంశీ
నటీనటులు: సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, టీనా శ్రావ్య, రాద్యా సురేశ్, తేజశ్వీరావు, సాయికుమార్
నిర్మాతలు : నిహారిక కొణిదెల, పద్మజ కొణిదెల , జయలక్ష్మి అడపాక
సంగీతం: అనుదీప్ దేవ్
సినిమాటోగ్రఫీ: రాజు ఎదురురోలు
ఎడిటర్: అన్వర్ అలీ
బ్యానర్: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, నిహారిక కొణిదెల ప్రొడక్షన్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్.
విడుదల తేదీ: 9 ఆగస్టు 2024
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 3/5
మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టి పెద్దగా సక్సెస్ అందుకోలేక పోయింది. ఇప్పుడు నిర్మాతగా కమిటీ కుర్రాళ్ళు తో సినిమా వైపు తొలి అడుగు వేసింది. నిర్మాతగా మారిన తర్వాత వెబ్ సిరీస్ లు, ఓటీటీ సినిమాలు చేసి మొదటిసారి ఒక ఫీచర్ ఫిలిమ్ ద్వారా థియేటర్స్ లో అడుగుపెట్టింది. మొదటి నుంచి ఈ సినిమాపై పాజిటీవ్ టాక్ ఉంది. దానికి తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఈ శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చిన కమిటీ కుర్రాళ్ళు ఎలాంటి విజయాన్ని సాధించిందో? నిర్మాతగా నిహారిక సక్సెస్ అయ్యిందో లేదో ఈ రివ్యూ లో చూద్దాం. 11 మంది కొత్త హీరోలతో ఒక కొత్త దర్శకుడు చేసిన ప్రయత్నమిది.
కథ :
వెస్ట్ గోదావరి జిల్లాలోని పురుషత్తం పల్లి అనే ఓ గ్రామంలో పన్నెండేళ్లకు ఒకసారి భరింకాళమ్మ తల్లి జాతర జరుపుకుంటారు. ఈ జాతరకు ముందు ఊరంతా కలిసి ఒక పంచాయతీ పెట్టుకోవటం ఆనవాయితీ. ఈసారి జాతర తరవాత పంచాయితీ ఎన్నికలు కూడా ఉండటంతో కీలక తీర్మానం చేస్తారు గ్రామ పెద్దలు. పంచాయితీ ఎన్నికల్లో శివ (సందీప్ సరోజ్) సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి రెడీ అవుతాడు. 12 ఏళ్ల క్రితం జరిగిన జాతరలో శివ స్నేహితులైన 10 మందిలో ఒకడు ప్రాణాలు కోల్పోతాడు. అందుకు కారణం స్నేహితుల మధ్య జరిగిన కులాల గొడవ. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాతర పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రచారం చేయకూడదని ఊరి పెద్దలు పంచాయితీలో నిర్ణయిస్తారు.
జాతరలో బలిచేట మోసే సత్తయ్య (కంచెరపాలెం కిషోర్) ఈ జాతరకు కీలకం. ఆయన చేతుల మీదగానే ఈ క్రతువు జరగాలి. కొన్ని పరిస్థితుల వలన సత్తయ్య ఆ గ్రామం విడిచివెళ్లిపోతాడు. జాతర జరగాలంటే సత్తయ్య మళ్ళీ రావాలి. సత్తయ్యని తీసుకొచ్చే బాధ్యత ఆ వూర్లో కొందరు కుర్రాళ్ళు తీసుకుంటారు. సత్తయ్య ఊరు విడిచి ఎందుకు వెళ్లిపోయాడు? సత్తయ్యని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి ముందుకు వచ్చిన కుర్రాళ్ళ కథేంటి ? ఈ కథలో బుజ్జి (సాయికుమార్) పాత్ర ఏమిటి? చివరికి ‘కమిటీ కుర్రోళ్ళు’ జాతర జరిపించారా లేదా ? అన్నది కథ. రిజర్వేషన్స్ అనే అంశంతో మొదలైన గొడవ కులాల గొడవగా మారటం, ప్రాణ స్నేహితులు విడిపోయి చివరికి ఊరికోసం కలవటం ప్రధానాంశం.
విశ్లేషణ:
ఈ సినిమాకి మెగా డాటర్ నిహారిక పేరు చేరటంతో సినిమా పై కొంచెం ఆసక్తి పెరిగింది. తరవాత వచ్చిన టీజర్ ట్రైలర్ కూడా ఆకట్టుకోవటంతో సినిమా పై మంచి అంచనాలతో ఓపెనింగ్స్ బాగానే ఉంటాయి. ఈ మధ్య వచ్చిన 90 # మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ తరహాలో 90 స్ వారికి ఎక్కువగా ఈ మూవీ కనక్ట్ అవుతుంది. కథ కొత్తదేమీ కాదు. తెలుగులో ఇప్పటికే ఫ్రెండ్షిప్, కురాళ్ళ నేపథ్యంలో బోలెడు సినిమాలు వచ్చాయి. ఈ తరహా కథలు ఎన్ని వచ్చినా, కుర్ర చేష్టలు బాగా అకట్టుకుంటాయి, అందుకే మళ్ళీ మళ్ళీ ఇలాంటి కథలు ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, కేరింత,, మ్యాడ్ లాంటివి ఇలా వచ్చి సక్సెస్ అయినవే. ఇప్పుడు ఈ కమిటీ కుర్రోళ్ళు కూడా యూత్ ఎంటర్ టైనర్ గా నిలుస్తుంది అనటంలో సందేహం లేదు. ఈ తరహా కథలు అందర్నీ అలరిస్తాయి. ఈ ఏజ్ లో ఉన్నవారితో పాటు పెద్దవాళ్ళని కూడా తమ కాలేజ్ డేస్ ని, తమ రోజుల్ని గుర్తు తెచ్చేలా చేస్తాయి.
కమిటీ కుర్రాళ్ళు మొదటి భాగం డీసెంట్ గా ఉంది. విలేజ్ డ్రామా కావడంతో మ్యాక్సీమమ్ యూత్ కనక్ట్ అవుతారు. కొబ్బరిమట్ట బ్యాటుతో క్రికెట్, పంపు సెట్ల కింద స్నానాలు, డీవీడీలు పెట్టుకుని సినిమాలు చూడటం, పుష్పవతి వేడుకల వీడియోల ఎడిటింగ్‌లు, అన్ని ఆ కాలం వారికి గుర్తువస్తాయి. కుర్రాళ్లు సందడి మధ్య పొలిటికల్ సీన్స్ కొంచెం ఎబ్బెట్టుగా ఉంటాయి. దర్శకుడు ఒక సన్నితమైన అంశాన్ని తీసుకుని అంతే సున్నితంగా, ఎవర్నీ బాధించకుండా ఆడియన్స్ ని ఆలోచింపజేసే ప్రయత్నం చేయటాన్ని మెచ్చుకోవలసిందే. జాతర సీక్వెన్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ కొంచెం స్లో గా సాగి , సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషన్ సీన్స్ రన్ చేసాడు దర్శకుడు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ నేటి పొలిటికల్ లీడర్స్ కు వేస్తున్న సెటైర్స్ లా అనిపించాయి. మెగా ఫాన్స్ కి అవి కిక్కిస్తాయి అనటంలో సందేహం లేదు. టోటల్ గా ఒక యూత్ ఫుల్ స్టోరీ కి ఎమోషన్, మెసేజ్ జోడించి చెప్పటం లో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
నటీ నటులు:
11మంది కుర్రాళ్లు కొత్తవారు. వీరే ఈ మూవీలో ముఖ్య పాత్రలు పోషించారు. శివగా సందీప్ సరోజ్, సుబ్బుగా త్రినాథ్ వర్మ, విలియంగా ఈశ్వర్ రచిరాజు, సూర్యగా యశ్వంత్ పెండ్యాల.. ఎవరికి వారే తమదైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు. సాయికుమార్, గోపరాజు రమణ, కంచరపాలెం కిషోర్ వంటి సీనియర్స్ ఈ కథకు అదనపు బలాన్ని ఇచ్చారు. పెద్దోడుగా ప్రసాద్ బెహరా నటన అందర్నీ అలరిస్తుంది.కామెడీ సీన్స్ లో నవ్విస్తూనే ఎమోషనల్ సీన్స్ లో అంతగా ఏడిపిస్తాడు.
టెక్నికల్ :
దర్శకుడు యదు వంశీకి ఇదే మొదటి సినిమా అయినా పరవాలేదనిపించుకున్నాడు. కాకపోతే ఒకే కథలో స్నేహం, ప్రేమ, కులాల సమస్య, రాజకీయం, రిజర్వేషన్స్ అన్ని టచ్ చేస్తూ వేటిని సంతృప్తిగా చెప్పలేకపోయాడు. నిడివి తక్కువ, లక్ష్యం పెద్దది అయిపోయింది. ప్రేక్షకుల్ని 90ల నాటి రోజుల్లోకి తీసుకెళ్లిన తీరు, గోదావరి యాసలో రాసుకున్న మాటలు, జాతర సన్నివేశాల్ని తీసిన తీరు అందర్నీ ఆకట్టుకుంటాయి. టెక్నికల్ టీంలో తెరువెనుక ఉండి ఈ సినిమాని ఆసక్తిగా నడిపించిన హీరో అనుదీప్ దేవ్. సినిమా స్టార్టింగ్ నుంచి చివరి వరకు అనుదీప్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఉపయోగపడింది. కథకి ఎక్కడా డిస్టబెన్స్ లేకుండా సాగిన సంగీతం ఆడియన్స్ ని మెప్పించింది. కొన్ని పాటలు వినటానికి చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా ఈ మూవీకి ప్లస్ అయింది. సినిమాలో వాడిన కలర్ పేలెట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మొదటి థియేటర్ సినిమాకి ఇలాంటి కథను ఎంచుకోవడం నిహారిక చేసిన సాహసం ఆ సాహసంతోనే విజయాన్ని అందుకుందని చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్స్
యూత్ కంటెంట్
90 స్ వింటేజ్ మూమెంట్స్
జాతర
సంగీతం
మైనస్ పాయింట్స్
సెకండ్ ఆఫ్
స్లో నేరేషన్
తెలిసినవారు లేకపోవటం
ఫైనల్ వర్దిక్ట్ : యూత్ ని ఆకట్టుకునే కమిటీ కుర్రాళ్లు.
ALSO READ: IN ENGLISH