ENGLISH

పవన్ సినిమాల పై క్లారిటీ వచ్చేసింది

07 August 2024-12:37 PM

డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్  ఫుల్ బిజీగా ఉన్నారు. మొదట ఎలక్షన్ ప్రచారంలో పాల్గొని టైం కేటాయించలేక పవన్ సినిమాలు వాయిదా పడ్డాయి. గెలిచాక కీలక బాధ్యతలు స్వీకరించటం  వలన సినిమాలకి టైం కేటాయించలేకపోతున్నారు. దీనితో పవన్ సినిమాలు ఎప్పుడు పూర్తి అవుతాయో, ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయి తెలియని పరిస్థితి. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తరవాత పవన్ కూడా తన సినిమాల గూర్చి స్పందిస్తూ, వారానికి రెండు మూడు రోజులు సినిమాలకి కేటాయిస్తానని, ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తానని  మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ లో పాల్గొన్న హరీష్ శంకర్ పవన్ సినిమాల గూర్చి, షూటింగ్స్ గూర్చి కీలక అప్డేట్స్  ఇచ్చారు.


హరీష్ శంకర్ కి పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ గూర్చి  ప్రశ్నలు ఎదురవగా  'పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీ అవ్వడంతో సినిమాలకు టైం కుదరట్లేదు. ఈ మధ్య పవన్ ని  మైత్రీ నిర్మాతలు కలిశారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేయడానికి పవన్ ట్రై చేస్తానని మాటిచ్చినట్లు' తెలిపారు. ముందు OG, హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్స్ జరుగుతాయని, తరవాత ఉస్తాద్ కి డేట్స్ ఇస్తారని హరీష్ తెలిపారు. కారణం ఆ రెండు సినిమాలు దాదాపు కంప్లీట్ అయ్యే దశలో ఉన్నాయని, వాటికి తక్కువ డేట్స్ ఇస్తే చాలని, ఉస్తాద్ కి కొంచెం టైం పడుతుంది, కావున ఆ రెండు సినిమాల తరవాత తన మూవీ ఉంటుందని హరీష్ క్లారిటీ ఇచ్చారు. 


'ఓజీ' కోసం కేవలం రెండు వారాలు కేటాయిస్తే చాలని, హరి హర వీరమల్లు 60 శాతం పూర్తి అయ్యిందని, హరీష్ ఉస్తాద్ భగత్ సింగ్ కేవలం 20 శాతం షూటింగ్ అయిందని తెలుస్తోంది. మొత్తానికి పవన్ సినిమాలు త్వరలో పూర్తి చేసుకుని, 2025 లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ఇంకో వైపు  ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయింది అన్న ప్రచారానికి తెర పడింది. పవన్ కొత్త సినిమాలుకి సైన్ చేయడు అన్న బాధ ఉన్నా, ఉన్న సినిమాలు వచ్చినా చాలని ఫాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.