ఎక్కడ చూసినా అఖండ గురించే. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబో మ్యాజిక్ చేసింది. మాస్ జాతర సృష్టించింది. తొలిరోజు వసూళ్లు అదిరిపోయాయి. రెండో రోజూ ఆ జోరు కొనసాగింది. ఆదివారం కూడా మంచి అంకెలే కనిపించబోతున్నాయి. ఈ సినిమా బాలకృష్ణ - బోయపాటిలకు బూస్టప్. తమన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. కానీ శ్రీకాంత్ పరిస్థితే దారుణంగా ఉంది.
ఈసినిమాలో వరదరాజులు పాత్రలో శ్రీకాంత్ నటించాడు. శ్రీకాంత్ ని ఇంత క్రూరమైన పాత్రలో చూడడం ఇదే తొలిసారి. బోయపాటి శ్రీను సినిమాలో శ్రీకాంత్ విలన్ అనే సరికి.. అందరిలోనూ ఆసక్తి మొదలైంది. లెజెండ్ లో జగపతిబాబు కెరీర్ ఎలా టర్న్ అయ్యిందో, అలా.. ఈసినిమాతో శ్రీకాంత్ కెరీర్ కూడా మారిపోతుందని అనుకున్నారు. కానీ... ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ఈ సినిమాలో శ్రీకాంత్ మెయిన్ విలన్ కాదు. బాబా పాత్ర పోషించిన వ్యక్తే విలన్. ఆ తరవాత శ్రీకాంత్. కాబట్టి... లెజెండ్ లో జగ్గూ భాయ్ స్థానం ఇవ్వలేం. పైగా ఆగెటప్ శ్రీకాంత్ కి అస్సలు సూటవ్వలేదు. ఆ పాత్రని కూడా అర్థాంతరంగా ముగించిన ఫీలింగ్ వచ్చింది. వరదరాజులు పాత్రని వీలైనంత క్రూరంగా చూపించాలన్న మిషతో... బోయపాటి లైన్ దాటేశాడు. శ్రీకాంత్ ఇంట్రో, పూర్ణ రేప్ సీన్లలో బోయపాటి గీత దాటాడన్న విషయం అర్థమవుతూనే ఉంది. అది ఒకరకంగా శ్రీకాంత్ కెరీర్‌పై నెగిటీవ్ ఇంపాక్ట్ తీసుకొచ్చే ప్రమాదం లో పడేసింది. ఈసినిమా చూశాక కూడా శ్రీకాంత్ కి విలన్ గా అవకాశాలు వచ్చాయంటే ఆశ్చర్యపోవాలి. మరి.. శ్రీకాంత్ లో ఈ విలనిజం ఎవరికైనా నచ్చిందో, లేదో?